సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 మార్చి 2021 (19:02 IST)

సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అంత మాటన్నాక పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా?

పదవుల కోసం కాదు, ప్రజల కోసం, సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నా అని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎలా చెప్పారో అదే నినాదంతో రాజకీయ అరంగేట్రం చేసిన వ్యక్తుల్లో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఒకరు. జనసేనాని పార్టీ పెట్టి మళ్లీ సినిమాల్లో నటించడం తనకు నచ్చలేదనీ, అందువల్ల పార్టీ వీడుతున్నట్లు ప్రకటించి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఆయన మరో పార్టీలో చేరలేదు. రాజకీయ ప్రకటనలు కూడా చేయలేదు. మౌనంగా వుండిపోయారు.
 
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ రాజకీయాల్లో చురుకుగా వుంటున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కనీసం 1000 కి పైగా పంచాయతీలను జనసేన కైవసం చేసుకోవడంతో పార్టీ క్రమంగా బలపడుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. దీనిపై జనసేనాని ఖుషీగా వున్నారు. కార్యకర్తలు, ఎన్నికైన పంచాయతీ వార్డు సభ్యులను అభినందించారు. మార్పు మెల్లగా ప్రారంభమైందని అన్నారు. ఇక ఆయన భాజపాతో కలిసి ముందుకు వెళుతున్నారు. రాజకీయపరంగా క్రమంగా సక్సెస్ సాధిస్తూనే పార్టీ కార్యక్రమాల కోసం సినిమాల్లో నటిస్తున్నారు.
 
ఈ ఫార్ములా మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అప్పట్లో నచ్చలేదు కానీ, పవన్ సినిమాలకు దగ్గరై పార్టీని వదిలేస్తారన్న అనుమానంతో బయటకు వచ్చారు. ఇప్పుడు జనసేన క్రమంగా నిలదొక్కుకుంటోంది. ఈ నేపధ్యంలో ఇటీవల లక్ష్మీనారాయణ ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో జనసేన పట్ల పాజిటివ్ గానే మాట్లాడారు. పవన్ కష్టపడుతున్న విషయాన్ని అంగీకరించారు.
 
మరి తిరిగి పార్టీలో చేరుతారా అని అడిగిన ప్రశ్నకు... పవన్ కళ్యాణ్ గారు మరలా నన్ను పిలిస్తే పునరాలోచన చేస్తానని తెలిపారు. దీన్నిబట్టి జనసేనాని పిలిస్తే లక్ష్మీనారాయణ తిరిగి పార్టీలో చేరేందుకు సుముఖంగా వున్నారని అర్థమవుతుంది. కాబట్టి ఎలాంటి ఇగోలకి పోకుండా నాయకులిద్దరూ మరోసారి చేయి కలిపితే పార్టీకి లాభం చేకూరుతుందనడంలో ఎంతమాత్రం అనుమానం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా ఓపెన్ అంటుంటారు. ఆయనకు ఎలాంటి ఇగోలు వుండవంటారు. మరి లక్ష్మీనారాయణనను తిరిగి పిలుస్తారో లేదంటే మౌనంగా వుండిపోతారో చూడాలి.