శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: గురువారం, 3 డిశెంబరు 2020 (16:13 IST)

తలైవా తెలివితక్కువ పని చేస్తున్నారా? పోయిపోయి ఇప్పుడు పార్టీ ఏంటి?

వచ్చే ఏడాది 2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. అంటే... మరో 5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో గత కొన్నేళ్లుగా పార్టీ స్థాపన గురించి మీనమేషాలు లెక్కించిన దక్షిణాది సూపర్ స్టార్, తలైనా రజినీకాంత్ ఓ ప్రకటన చేసారు. తను రాజకీయాల్లోకి వస్తున్నాననీ, డిసెంబర్ 31వ తేదీ పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటిస్తానంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు రజినీకాంత్.
 
దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రజినీకాంత్ ఆలస్యంగానైనా రాజకీయాల్లోకి వస్తుండటంతో తమిళనాడులో పెద్ద చర్చే జరుగుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో రజినీ తాజాగా పార్టీ పెట్టడం మాత్రం ప్రధాన పార్టీల నేతల్లో గుబులు పట్టుకుంది.
 
అయితే ఇప్పటికే రజినీని తమవైపు ఆహ్వానించారు బిజెపి. ముఖ్యంగా అగ్రనేతలే ఆయనతో స్వయంగా కూడా మాట్లాడారు. బిజెపి మధ్దతు ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో కూడా రజినీ ఉన్నారు. కానీ అభిమానులకు అది ఏమాత్రం ఇష్టం లేదు. గత మూడురోజుల క్రితం జరిగిన భేటీలో కూడా అభిమానులు బిజెపితో అస్సలు కలవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. 
 
అలాగే తమిళ నీతిమయ్యం పేరుతో కమల్ హాసన్ పార్టీ పెట్టి జనంలో ఉండడం.. త్వరలోనే రజినీకాంత్‌ను కలుస్తానని ఆయన చెప్పడం కూడా జరిగింది. రాజకీయాల్లో మిత్రులైనా, శత్రువైనా ఒకటే విధంగా చూడాలని... కాబట్టి రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకోవాలని.. సింగిల్ గానే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలన్న నిర్ణయంలో రజినీకాంత్ ఉన్నారట.
 
ఎవరికి మద్దతు ఇవ్వకుండా సోలోగా తనకున్న చరిష్మాతో ప్రజల దగ్గరకు వెళ్లి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, ఈ ఐదు నెలల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఆ తరువాత అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటున్నారట రజినీ. మరి ఇంత తక్కువ సమయంలో పార్టీని ఎలా గాడినపెడతారోనన్న అయోమయం నెలకొంది. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టాలన్న రజినీకాంత్ ఆలోచన తెలివితక్కువ పని అని అక్కడ కొందరు అంటున్నారు. మరి తలైవా నిర్ణయం తెలివైనదా లేదంటే తెలివితక్కువదా అన్నది మరో 5 నెలల్లో తేలిపోనుంది.