పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...
గత సాధారణ ఎన్నికల్లో వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ క్యాప్చర్‌ను ధైర్యంగా ఎదిరించిన టీడీపీ నేత నంబూరి శేషగిరి రావు గుండెపోటుతో మృతిచెందారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన నంబూరి శేషగిరిరావు టీడీపీకి బలమైన నేతగా గుర్తింపు పొందారు.
ఆయన మృతిపట్ల టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా అరాచకాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన ఒక యోధుడిని కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.
పసుపుజెండా చేతబట్టి రౌడీ, ఫ్యాక్షన్ రాజకీయాలపై శేషగిరిరావు చేసిన తిరుగుబాటు ప్రతి కార్యకర్త, నాయకుడికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. శేషగిరిరావు లేకపోయినా మాచర్ల నియోజకవర్గంలో ఆయన చేసిన పోరాటం పార్టీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. అతని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.
అలాగే, నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులకు మంత్రి గొట్టిపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సాధారణ ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ క్యాప్చర్‌ను శేషగిరిరావు అడ్డుకున్నారని గుర్తుచేశారు.