గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (17:45 IST)

ఆడబిడ్డ జన్మిస్తే రూ.5 వేలు సహాయం: గ్రామ సర్పంచ్ అభ్యర్థి హామీ

cash
సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రధాన హామీలతో మేనిఫెస్టో తయారుచేసి విడుదల చేస్తుంటారు. అయితే, పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఓ అభ్యర్థి కూడా మేనిఫెస్టో విడుదల చేశారు.
 
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కొడారి లత సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి ఏంచేస్తాననే వివరాలతో ఓ భారీ మేనిఫెస్టో తయారు చేసి తాజాగా గ్రామ సభలో విడుదల చేశారు. పార్టీలకు అతీతంగా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ 14 అంశాలతో కూడిన మేనిఫెస్టో పోస్టర్‌ను గ్రామస్థులకు పంచారు.
 
గ్రామపంచాయతీలో మంచినీటి ఫిల్టర్, గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం వైకుంఠ రథం, ఫ్రీజర్ సదుపాయం కల్పించడంతో పాటు కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తానని చెప్పారు. దీంతోపాటు వాటర్ ట్యాంకర్, ఇంటి పన్ను మాఫీ, ఆడపిల్ల జన్మిస్తే రూ.5 వేలు సహాయం, ఆడపడుచులకు పెళ్లి కానుక, ఒంటరి మహిళలు, వృద్ధులకు నివాస వసతి గృహం, ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని కొదారి లత హామీ ఇచ్చారు.
 
నిరుద్యోగ ఆడపడుచులకు టైలరింగ్ శిక్షణ కేంద్రం, స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్, చేపల పెంపకం విషయంలో ముదిరాజ్ లకు చెరువులపై పూర్తి అధికారం కోసం కృషి, గ్రామంలో గ్రామ దేవతల గుడి నిర్మాణం, అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, బస్తీ దవాఖాన, గ్రంథాలయం తదితర సదుపాయాలు కల్పిస్తానని కొడారి లత తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.