సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:37 IST)

వందేళ్ల చరిత్రను తిరగరాసిన హైదరాబాద్ వర్షాలు.. (video)

Hyderabad Floods
వందేళ్ల చరిత్రను హైదరాబాద్ వర్షాలు తిరగరాశాయి. కనివిని ఎరుగని రీతిలో ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిలో గంటల తరబడి వర్షాలు కురుస్తూనే వున్నాయి. దీంతో మహానగరం భయంతో వణికిపోయింది. వర్ష బీభత్సంతో విలవిలలాడింది. 
 
గంటల తరబడి దంచికొట్టిన వానతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అండమాన్‌లో ఏర్పడిన వాయుగుండం తీవ్ర ఉధృతితో గ్రేటర్‌ హైదరాబాద్‌ను తాకిన తర్వాత మంగళవారం పట్టపగలే ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. నగరం చీకటిగా మారింది. అప్పటివరకు జల్లులతో తడుస్తున్న నగరంలో ఒక్కసారిగా వర్షం విధ్వంసం సృష్టించింది. 
 
గత రెండు రోజులుగా కురిసిన వానలకు.. పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో ఈ రేంజ్‌లో వర్ష కురవడం గత వందేళ్లలో ఇదే మొదటిసారి. 1903లో చివరిసారి ఇలాంటి వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో గత 24 గంటల్లో సుమారు 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు ఐఎండీ వెల్లడించింది. 
 
ప్రస్తుతం వాయుగుండం తెలంగాణ దాటి కర్నాటకలోని గుల్బర్గా దిశగా వెళ్తోంది. డిప్రెషన్ వేగంగా మహారాష్ట్ర దిశకు పయనిస్తున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. రానున్న 12 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 
 
ఇంకా తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వరదనీరు రోడ్లపై మోకాలిలోతు నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మ్యాన్‌ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలని, నాలాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్‌, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని తెలిపారు.
 
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ జలాశయంలో నీటిమట్టం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దాదాపు సగం నగరంలో కురిసే వర్షమంతా హుసేన్ సాగర్ జలాశయానికి, అక్కడి నుంచి మూసీ నదిలోకి వెళుతుందన్న సంగతి తెలిసిందే. గత వారంలో కురిసిన వర్షాలకే జలాశయం పూర్తిగా నిండిపోగా, మంగళవారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా భారీ వరదగా హుసేన్ సాగర్ లోకి వచ్చి చేరుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.