బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (12:43 IST)

మీరు సైకిల్ తొక్కుతున్నారా? ఎన్నిప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుతం జీవితచక్రం వేగంగా పరుగులు తీస్తోంది. సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటి నుంచి కాలు బయట పెడితే బైక్​ లేదంటే కారు వాడుతున్నాం. కొద్దిపాటి దూరమైనా వీటిని వాడేస్తుండడం వల్ల శరీరానికి ఎక్సర్‌సైజ్ లేకుండా పోతోంది. ప్రతిరోజు వ్యాయామం చేయాలనుకునేవాళ్లు కనీసం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే చాలట. 
 
సైకిల్ తొక్కడం వల్ల శరీరం మొత్తం కదులుతుంది. ఫలితంగా దాదాపు అన్ని భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరగడంలో దోహదం చేస్తుంది. అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ పేషెంట్‌లు సైక్లింగ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. రోజువారీ 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే 60 శాతం వరకు మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సైక్లింగ్ ద్వారా హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది.
 
మనం సైకిల్ తొక్కుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో శ్వాస తీసుకోవడం, వదలడం వేగంగా చేస్తాము. కాబట్టి శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కీళ్ల నొప్పులతో ఉన్న వాళ్లు సైక్లింగ్ అలవాటు చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీనితో పాటు డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.