ఆరోగ్యానికి మేలు చేసే పప్పు గింజలు..
పప్పు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనికికారణం... పప్పు గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటమే ప్రధానకారణం. బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్, వేరుశెనగపప్పుల్లోని అసంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పప్పు గింజలు ఎంత ఆరోగ్యకరమైనవైనా మితంగానే తీసుకోవాలి.
అప్పుడే వీటితో కలిగే ప్రయోజనాలు ఉంటాయి. పప్పు గింజలలో ఉండే అన్సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. గుండె లయ తప్పటాన్ని నిరోధించి గుండెపోటు రాకుండా రక్షిస్తాయి. ముఖ్యంగా పప్పు గింజల్లో పీచు స్థాయి కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గటానికే కాదు కడుపు నిండిన భావనా కలిగిస్తుంది.
దీంతో త్వరగా ఆకలి వేయదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం బారినపడకుండా నివారిస్తుంది. వీటిలో మెండుగా ఉండే విటమిన్ ఇ రక్తనాళాల్లో పూడికలను నివారిస్తుంది. అందువల్ల గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీడిపప్పును ఇతర పప్పులతో కలిపి వంటలో ఉపయోగిస్తే మాంసకృతులన్నీ తీసుకున్నట్టవుతుంది.
పిస్తాలో విటమిన్ ఏ, సి, బి6 ఉంటాయి కాబట్టి రోగనిరోధకశక్తినీ పెంపొదిస్తాయి. గాలికి, వెలుతురుకు గురైతే త్వరగా రంగు, రుచి మారిపోతాయి. వేరుశనగల్లో ఒలియెక్ కొవ్వు ఉంటుంది. మోనో అసంతృప్తకొవ్వు ఆమ్లాలూ ఎక్కువే. అందువల్ల వీటిని తరచుగా తీసుకుంటే గుండె జబ్బుల బారినపడకుండా కాపాడతాయి.