శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (21:38 IST)

వృద్ధులు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? (video)

వయసును బట్టి ఆహార నియమాలను పాటించాలి. యవ్వనంలో తిన్న తిండి వృద్ధాప్యంలో కూడా తీసుకుంటే జీర్ణ వ్యవస్థను కష్టపెట్టినట్లే. ఎందుకంటే యవ్వనంలో వున్నప్పుడు ఆయా అవయవాలు చేసే పనితీరుకు వృద్ధాప్యంలో పనితీరుకు తేడా వుంటుంది. కనుక ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
 
వృద్ధుల్లో విటమిన్‌ డి, క్యాల్షియం, విటమిన్‌ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం ఎక్కువ. కాబట్టి వృద్ధులు తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి.
 
సముద్ర ఆహారం, తేలికైన మాంసం నుంచి విటమిన్‌ బీ 12 అందుతుంది. మలబద్ధకం సమస్య వృద్ధుల్లో చాలామందిని వేధిస్తుంటుంది. ఇలాంటివారు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం తీసుకుంటుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడొచ్చు. వీటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది.
 
పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి వంటి కొవ్వులు తగ్గించడం మంచిది.