1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (20:49 IST)

చిన్నపిల్లల్లో పెరుగుతున్న స్కార్లెట్ జ్వరం

Fever
హైదరాబాద్ నగరంలోని చిన్నారులు స్కార్లెట్ జ్వరం బారినపడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఒకవైపు పల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఈ వ్యాధి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ జ్వరంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య కార్పొరేట్ ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో చేరి చికిత్స పొందుతున్నారు. 20 మంది జ్వర బాధితుల్లో 10 నుంచి 12 మందిలో ఈ స్కార్లెట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
గతంలోనూ ఈ వ్యాధి ఉన్నప్పటికీ ఇటీవలికాలంలో మళ్లీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న చిన్నారుల్లో ఈ జ్వర లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్నిసార్లు వైరల్ లక్షణాలుగా భావించినా చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే... ఆసుపత్రిలో చేరేవరకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాల కన్పించిన వెంటనే చికిత్స అందించాలని సూచిస్తున్నారు. 
 
ఈ స్కార్లెట్ జ్వరమనేది స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియ కారణంగా సోకుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ద్వారా పక్కనున్న పిల్లలకు అంటుకుంటుంది. ఈ తుంపర్లు పడిన చోట చేతులు పెట్టి వాటిని గొంతు, ముక్కు వద్ద తాకించినా ఇతరులకు సోకుతుంది. ఇప్పటికే నగరంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈ స్కార్లెట్ జ్వరంపై తల్లిదండ్రులకు జాగ్రత్తలు సూచిస్తూ వాట్సాప్ సమాచారం పంపాయి. లక్షణాలు కన్పిస్తే... వెంటనే చికిత్స అందించాలని...వ్యాధి తగ్గే వరకు పిల్లలను పాఠశాలలకు పంపొద్దని అందులో సూచించాయి.
 
ఇవీ లక్షణాలు...
102 డిగ్రీలతో కూడిన జ్వరం 
ఆకస్మాత్తుగా గొంతు నొప్పి తలనొప్పి, వికారం, వాంతులు
కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు
నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారుతుంది
గొంతు, నాలుకపై తెల్లని పూత
ట్రాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దవిగా కన్పిస్తాయి.