మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మనీల
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2019 (09:40 IST)

సబ్జా గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో....

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఆహారం తీసుకునే ముందు గ్లాసు నీళ్లలో సబ్జా గింజలను వేసుకుని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కెలొరీలు కూడా చాలా తక్కువ.
 
* సబ్జా గింజలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంలో సాయపడతాయి. గ్లాసు నీళ్లలో నాలుగు చెంచాల సబ్జా గింజలను వేసి నానబెట్టాలి. అరగంట తర్వాత గ్లాసు పచ్చిపాలలో వేసుకుని, కొన్నిచుక్కల వెనిల్లా కలిపి తాగాలి. ఇది టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనాన్నిస్తుంది. సబ్జా గింజల పాలను కాఫీ, టీలకు బదులు తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట తగ్గుతాయి.
 
* మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింప చేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది. ఈ సబ్జా గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి.
 
* ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగండి, సమస్య తగ్గడంతో పాటు మానసికంగా ప్రశాంతత కూడా ల‌భిస్తుంది.
 
* వీటిలో విటమిన్లూ, పోషకాలూ, ఇనుమూ ఎక్కువగా ఉంటాయి. చిన్న కప్పు సబ్జా గింజలను తరచూ తీసుకోవడం వల్ల కావాల్సినంత ఇనుమూ, పోషకాలూ శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి సొంతమవుతుంది.
 
* క్రీడాకారులకు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు.అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలు పీడిస్తున్న‌ప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి. 
 
* సబ్జా గింజల‌ను రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.వీటిలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి. ఈ గింజలు కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.
 
* రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలో,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.