ఆఫీసుల్లో డైనింగ్ టేబుళ్లు... పాదరక్షలతో భోజనం చేస్తున్నారా..?
భోజనం చేసే విధానంలో మార్పులొచ్చేశాయి. ఆహారం తీసుకునేందుకు నియమ నిబంధనలు చాలా మారిపోయాయి. ఎక్కడో ఓ చోట కూర్చుని కానించేయడం.. కుర్చీల మీద భోజనం చేసేయడం, హడావుడిగా తినడం వంటివి ప్రస్తుతం కాలంలో జరుగుతున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే ఫ్యాషన్ పోకడల కారణంగా పాదరక్షలను సైతం విడవకుండా అలానే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ పద్ధతి సరికాదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
భగవంతుడు అందించిన ఆహారం ఈ విధంగా స్వీకరించడం మంచిది కాదని వారు చెబుతున్నారు. ఎవరికి ఎన్ని పనులు ఉన్నా, ఎంత తీరిక లేకుండా ఉన్నా భోజనం చేసే విషయంలో కొన్ని నియమ నిబంధలను పాటించాలి. స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, పద్మాసనం వేసినట్టుగా కూర్చుని నిదానంగా భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
తూర్పు ముఖంగా గానీ, దక్షిణ ముఖంగా గానీ కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని నామాన్ని స్మరిస్తూ భోజనం చేయాలి. లేదంటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తడమే కాకుండా, ఆయుష్షు, యశస్సు నశిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.