మసాజ్ చేయించుకుంటూ మీటింగ్‌కు హాజరైన ఎయిర్‌ఏషియా సీఈవో - నెటిజిన్స్ ఫైర్
ధనవంతులు చేసే చిన్నచిన్న తప్పులే వారిని వివాదాల్లోకి లాగుతుంటాయి. తాజాగా ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో మసాజ్ చేయించుకుంటూ వర్చువల్ విధానంలో ఆయన సమావేశానికి హాజర్యయారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తాజాగా లింక్ట్రిన్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మసాజ్ చేసుకుంటూ మేనేజమెంట్ మీటింగ్‌కు ఇలా హాజరైనట్లు ఆయనే స్వయంగా ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఎయిర్ ఏషియాలో పని సంస్కృతికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తిట్ల పురాణం అందుకున్నారు.
'ఒక లిస్టెడ్ కంపెనీకి సీఈఓగా ఉంటూ.. మేనేజ్‌మెంట్ మీటింగ్‌కు ఇలా షర్ట్ లేకుండా హాజరవ్వడం ఏమాత్రం సభ్యత అనిపించుకోదు' అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టారు. బహుశా ఎవరో ఆయన లింక్‌ను హ్యాక్ చేసి ఉంటారని మరో యూజర్ రాసుకొచ్చారు. 'మీ వర్క్ కల్చర్ చూపించడానికి ఇది సరైన పద్ధతి కాదు' అని మరో నెటిజన్ కామెంట్ పెట్టగా.. 'ఓపెన్ కల్చర్ అంటే మరీ ఇంత ఓపెన్ అనుకోలేదు' అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు.