గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2023 (11:20 IST)

కిడ్నాప్ అయితే నాకేంటి.. అది నా సమస్య కాదు.. టైమ్‌కు రెంట్ కట్టాల్సిందే..

Israel war
ఇజ్రాయెల్ దేశంలో హమాస్ ఉగ్రవాదులు సాగించిన మారణకాండతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఉగ్రవాదులు సాగించిన అకృత్యాలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజులు గాజా సరిహద్దు ప్రాంతంలో జరిగిన సూపర్ నోవా రేవ్ పార్టీలో హమాస్ ఉగ్రవాదులు రాకెట్‌లో దాడి చేశారు. ఇందులో దాదాపు 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా నరమేథం కొనసాగించారు. యువతులు, మహిళను కిడ్నాప్ చేశారు. ఇలా హమాస్ మిలిటెంట్లు బంధించిన యువతులలో ఇన్బార్ హైమన్ కూడా ఒకరు. అయితే, తాజాగా ఇన్బార్ ఉంటున్న ఇంటి ఓనర్ తనకు రావాల్సిన రెంట్ కోసం డిమాండ్ చేయడం విస్మయం కలిగిస్తోంది.
 
ఇన్బార్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారని ఆమె రూమ్మేట్ చెప్పినా సదరు ఓనర్ వినిపించుకోలేదట. 'కిడ్నాప్ అయితే నాకేంటి.. అది నా సమస్య కాదు. టైమ్‌కు రెంట్ కట్టకుంటే సామాన్లు బయటపడేసి వేరే వారికి అద్దెకు ఇచ్చుకుంటా' అని తేల్చి చెప్పాడట. మరో రూమ్మేట్‌ను వెతుక్కుంటావా లేక ఆమె పేరెంట్స్‌తో మాట్లాడి నా రెంట్ చెల్లిస్తావా.. ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకోవాలని సూచించాడట. ఈ విషయాన్ని ఇన్బార్ రూమ్మేట్ ఆమె తండ్రికి తెలియజేశాడు. దీంతో ఆ ఓనర్ తో జరిపిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లను ఇన్బార్ తండ్రి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
 
ఓవైపు కూతురు మిలిటెంట్ల చెరలో ఉందని తాము బాధపడుతుంటే ఇంటి ఓనర్ కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మిగతా ఓనర్లైనా కనీస మానవత్వం చూపాలని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడం, నెటిజన్లు తీవ్రంగా మండిపడడంతో ఇన్బార్ ఓనర్ స్పందించాడు. ఇన్బార్ అసలు రెంట్ బాకీ పడలేదని, అలాంటప్పుడు తాను రెంట్ ఎలా డిమాండ్ చేస్తానని ఎదురు ప్రశ్నించాడు. అందరితో పాటు తాను కూడా ఇన్బార్ సహా ఇతర బందీలుగా అంతా క్షేమంగా రావాలనే కోరుకుంటున్నానని చెప్పాడు.