పెయింటర్‌తో పెళ్లి చేస్తున్నారనీ.. ఎంబీఏ విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో ఓ విషాదకర ఘటన జరిగింది. తనకు పెయింటర్‌ను ఇచ్చి పెళ్ళి చేసేందుకు ఏర్పాట్లు చేయాడాన్ని జీర్ణించుకోలేని ఎంబీఏ విద్యాభ్యాసం చేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
జీడిమెట్ల సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ ప్రాంతంలో ఉండే కరీంశెట్టి జన్ని, సత్యవతి అనే దంపతుల కుమార్తె యవనాగదుర్గ (23). ఎంబీఏ చదువుతుంది. ఈమెకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఓ పెయింటర్‌ను వరుడుగా ఖరారు చేసి గత ఫిబ్రవరి నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే, అతనితో పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని ఆ యువతి.. అప్పటి నుంటి ముభావంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే పెళ్లి ముహూర్తం ఖరారు చేసి, పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 29వ తేదీన యువతి తల్లిదండ్రులు పెళ్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆ యువతి, సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే, భోజనం తెచ్చేందుకు సోదరుడు బయటకు వెళ్లగా, నాగదుర్గ ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, పెయింటర్‌తో పెళ్లి ఇష్టంలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు చెప్పారు.