శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (18:57 IST)

ఇండియానే సురక్షితం : స్వదేశానికి వెళ్లమంటున్న అమెరికా విద్యార్థులు

అగరాజ్యం అమెరికాను కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రతి రోజూ వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కోరనా వైరస్ కోరల్లో చిక్కిన దేశంగా అగ్రరాజ్యం అమెరికా నిలించింది. పైగా, ఈ వైరస్ బారినపడిన వారిని రక్షించలేని పరిస్థితి ఆ దేశ పాలకులు ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న అమెరికా విద్యార్థులు, పౌరులు స్వదేశానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా, భారత్‌లో ఉంటున్న అమెరికా పౌరులు అందుకు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇపుడు మా దేశం కంటే ఇండియానే సురక్షితం. ఇక్కడ ఉంటేనే మా ప్రాణాలను దక్కించుకోగలమంటున్నారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 59 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు ఇప్పటికే 10 లక్షలు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లు తమ దేశానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. 
 
ఈ మహమ్మారి తీవ్రత తగ్గేంత వరకు మన దేశంలోనే భద్రంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన దౌత్యవేత్త ఇయాన్‌ బ్రౌన్లీ  తెలిపారు. అమెరికా వచ్చేందుకు ఇది వరకు పేర్లు నమోదు చేసుకున్నవాళ్లు ఇప్పుడు ప్రత్యేక విమానాల్లో సీట్లు ఖాయం చేసుకోవాలని చెబితే స్పందించడం లేదని బ్రౌన్లీ చెప్పారు. 
 
గతవారం ఇండియా నుంచి నాలుగు వేల మంది అమెరికన్లు స్వదేశానికి తిరిగివెళ్లారు. మరో ఆరు వేల మంది తమను తీసుకెళ్లే  ప్రత్యేక విమానాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇపుడు వారివైపు నుంచి స్పందన రావడం లేదని చెప్పుకొచ్చారు.