శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (11:04 IST)

రైలు ఎక్కాలంటే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు 2 గంటలు ముందుగా..

కరోనా వైరస్ దెబ్బకు దేశంలో రైలు ప్రయాణం మరింత కఠినంకానుంది. విమానం ఎక్కేందుకు ఏవిధంగా అయితే ఎయిర్‌పోర్టుకు రెండు గంటలకు ముందుగా చేరుకుంటామో.. అలాగే, రైలు బయలుదేరే సమయానికి రెండు గంటలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలితేనే రైలు బోగీలోకి ఎక్కనిస్తారు. ఇలాంటి కఠిన నిబంధనలతో ఇకపై రైలు ప్రయాణం సాగనుంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లోవుంది. ఈ కారణంగా రైల్వే శాఖ కూడా రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం సాగుతున్న రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రైళ్ళ రాకపోకలు కొనసాగించాలన్న ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. 
 
అయితే, కఠిన ఆంక్షలతో రైళ్లను నడపాలని భావిస్తోంది. మే మూడో తేదీన లాక్‌డౌన్ తొలగించి, రైళ్లు నడిచేందుకు అనుమతులు లభిస్తే, రైళ్లలో ప్రయాణాలకు కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరికానుంది. ఈ మేరకు పలు రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునిలోనూ ఇదే తరహా మాక్ డ్రిల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించారు.
 
రైలు ఎక్కాలంటే, ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవాల్సివుంటుంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. 
 
ఇక బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తంమీద కరోనా వైరస్ తర్వాత ప్రతిదీ ఆంక్షలతో కూడుకోనుంది.