మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (11:25 IST)

ఏపీలో మరో 73 కరోనా కేసులు.. ఆరోగ్య మంత్రి పేషీ అటెండర్‌కు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బుధవారం కూడా మరో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,332కు చేరుకుంది. ముఖ్యంగా, ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేషీలో పని చేస్తున్న ఓ అటెండర్‌కు ఈ వైరస్ సోకింది. దీంతో ఆ పేషీలోని సిబ్బంది మొత్తానికి ఈ వైరస్ పరీక్షలు చేయగా, ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,727 శాంపిళ్లను పరీక్షించగా 73 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వీటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,332కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 287 మంది డిశ్చార్జ్ కాగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,014గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 31 మంది మరణించారని వివరించింది.
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 1, గుంటూరులో 29, కడపలో 4, కృష్ణాలో 13, కర్నూలులో 11, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  
 
ఇప్పటివరకు జిల్లాల వారీగా నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 58, చిత్తూరు 77, ఈస్ట్ గోదావరి 28, గుంటూరు 283, కడప 69, కృష్ణ 236, కర్నూలు 343, నెల్లూరు 82, ప్రకాశం 60, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 23, వెస్ట్ గోదావరి 56 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.