శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (11:57 IST)

కరోనా పుట్టుక అక్కడే... మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించేలా తీర్చిదిద్దారు...

ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ పుట్టకపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు, పలు అగ్రదేశాలు మాత్రం ఈ వైరస్ చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సైన్స్ రచయిత నికోలస్ వేడ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 
 
మానవ కాణాల్లోనూ, మానవ జన్యువులు కలిగిన ఎలుకల్లోనూ కరోనా వైరస్‌లు ఇన్ఫెక్షన్లు కలిగించేలా వూహాన్‌లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసినట్టు వేడ్ రాసిన ఓ వ్యాసం సర్వత్ర చర్చనీయాంశమైంది.
 
కరోనా వైరస్ మూలాల గురించి ఆయన ఎన్నో ప్రశ్నలు సంధించారు. కరోనా వైరస్ ల్యాబ్‌లోనే పురుడుపోసుకుందని చెప్పడానికి ప్రాతిపదిక ఉందని వేడ్ తన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే, వాటికి సంబంధించిన రికార్డులు మాత్రం లేవన్నారు. 
 
కరోనా మూలాలకు సంబంధించి రెండు సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయని, అందులో ఒకటి సహజ సిద్ధంగా వన్యప్రాణుల నుంచి మానవుల్లోకి చేరడం అయితే, రెండోది వైరస్‌పై ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి వ్యాప్తి చెందడమని వివరించారు.
 
అయితే, ఇది సహజ సిద్ధంగా వ్యాప్తి చెందిందనే దానికన్నా ల్యాబ్ నుంచి లీకేజీ అయిందని చెప్పే వారే ఎక్కువున్నారు. దీనికి కారణాన్ని కూడా ఆయన తన వ్యాసంలో రాసుకొచ్చారు. వూహాన్‌లో ఎప్పటి నుంచో వివిధ రకాల కరోనా వైరస్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అక్కడి ప్రయోగాల్లో గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లో జన్యుమార్పులు చేయడం ద్వారా మానవుల్లో ఇన్ఫెక్షన్‌ కలిగించేలా ప్రయోగాలు చేశారని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.