మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (12:40 IST)

మసూద్‌పై మరోసారి పంతం నెగ్గించుకున్న చైనా

చైనా మరోసారి తన అసలు రంగును బయట పెట్టుకుంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి అడ్డుపుల్ల వేసింది. భద్రతా మండలిలో చైనా తనకున్న వీటో అధికారంతో మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనను నాలుగోసారి చైనా తిరస్కరించింది.
 
మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తీర్మానాన్నిప్రవేశపెట్టాయి. ఈ ప్రతిపాదనకు మార్చి 13వ తేదీ తుది గడువుగా నిర్ణయించగా సరిగ్గా 13వ తేదీ గడువు ముగిసే అర గంట ముందు సాంకేతిక కారణాలను సాకుగా చూపించి చైనా అడ్డు తగిలింది.
 
ఈ సాంకేతిక కారణాలకు సాకుగా చూపి చైనా మరో ఆరు నెలల పాటు మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఆపగలుగుతుంది. ఆపై మరో మూడు నెలల వరకు కూడా పొడిగించవచ్చు. ఇప్పటికే తనకున్న వీటో అధికారంతో చైనా 3 సార్లు మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోగా ఇది నాలుగవసారి కావడం విశేషం.