శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:46 IST)

భారత సరిహద్దుల వద్ద చైనా 5జీ సిగ్నల్ స్టేషన్‌.. కేబుళ్ల ద్వారా ఇబ్బందే..?!

భారత సరిహద్దుల వద్ద చైనా 5జీ కమ్యూనికేషన్ సిగ్నల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో ఈ సిగ్నల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది చైనా.  ప్రపంచంలో అత్యంత ఎత్తులో (5,374 మీటర్లు) నిర్వహిస్తున్న రాడార్‌ స్టేషన్‌ ఇదే కావడం గమనార్హం. ఈ విషయాన్ని చైనా మిలటరీ వెబ్‌సైట్‌ ధ్రువీకరించింది. సరిహద్దులోని రక్షణ దళాలకు కమ్యూనికేషన్‌లో సమస్యలను తొలగించేందుకు దీనిని ఉపయోగించనున్నారు. ఈ సేవలతో దట్టమైన పర్వతాల్లో ఉన్నా సైనికులకు స్పష్టమైన సిగ్నళ్లను చైనా అందించగలుగుతుంది.
 
భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో సరిహద్దుల వెంబడి భారీస్థాయిలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా పావులు కదపడం చైనా మొదలుపెట్టింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ధ్రువీకరించారు. ''వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వేయడం ఆందోళన కలిగిస్తోంది'' అని అప్పట్లో ఓ భారత అధికారి చెప్పారు. 
 
ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు దృశ్యాలను, డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు. ''రేడియోలో మాట్లాడితే దొరికిపోవచ్చు. సంకేతాలను అడ్డుకోవచ్చు. ఆప్టికల్‌ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా ఉంటుంది'' అని ఆ అధికారి చెప్పారు.