గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 23 మార్చి 2021 (12:28 IST)

భారత్‌-చైనా: అరుణాచల్‌ ప్రదేశ్‌లో యురేనియం అన్వేషణ, చైనా ఎందుకు కంగారుపడుతోంది?

అరుణాచల్‌ ప్రదేశ్‌లో యురేనియం నిక్షేపాలు కనుగొనడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. "భారత దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో భారతే నిర్ణయించుకుంటుంది. దీనికి చైనాను అడగాల్సిన పనిలేదు" అని స్పష్టం చేసింది. "మా రాష్ట్రంలో, మా భూమిలో మేం పని చేసుకుంటున్నాం. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం తప్పు. మేం చైనా స్పందనను పట్టించుకోం" అని అరుణాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ అధికార ప్రతినిధి డొమినిక్‌ తాడర్‌ బీబీసీతో అన్నారు.

 
"షియోమి జిల్లా అరుణాచల్‌ ప్రదేశ్‌లోనిది. అరుణాచల్‌ భారతదేశంలో ఒక భాగం" అని ఆయన అన్నారు. "చైనా వ్యవహారశైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మేం అరుణాచల్‌ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇక్కడికి వస్తుంటారు. చైనా ప్రభుత్వం, ప్రజలు దీన్ని సహించలేరు. ఇలాంటి చెడు అలవాటును వారు మానుకోవాలి" అన్నారు తాడర్‌.

 
అరుణాచల్‌లో యురేనియం గనులు బయటపడిన అంశంపై చైనా అధికార వార్తా పత్రిక 'గ్లోబల్ టైమ్స్‌ వార్త రాసింది. అక్కడ భారత్‌ యురేనియం తవ్వడం చట్ట విరుద్ధమని తమ దేశ అధికారులు అన్నట్లు చెప్పుకొచ్చింది. "దక్షిణ టిబెట్‌లో భారత్‌ యురేనియం కనుగొన్న విషయాన్ని ఆ దేశ మీడియా గొప్పగా చెబుతోంది. చైనా భూభాగాన్ని ఆక్రమించడంలో భారత వైఖరి దీనిని బట్టి స్పష్టమవుతోంది"అని 'గ్లోబల్‌ టైమ్స్‌' పత్రిక మార్చి 17న ఒక కథనం రాసింది. భారత్‌ అనుసరిస్తున్న వైఖరి రెండు దేశాల మధ్య సరిహద్దు చర్చలను క్లిష్టతరం చేస్తుందని చైనా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 
చైనాకు అభ్యంతరాలు ఎందుకు?
అరుణాచల్‌‌ ప్రదేశ్‌ వివాదాస్పద భూభాగం అన్నది చైనా వాదన. ఈ రాష్ట్రాన్ని'దక్షిణ టిబెట్'లో భాగమని ఆ దేశం అభివర్ణిస్తుంది. ఈ ప్రాంతంపై భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి చైనా నిరాకరిస్తోంది. "గత శతాబ్దంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ అక్రమంగా ఏర్పడిన ప్రాంతం. అందులో 90,000 చదరపు కిలోమీటర్ల చైనా భూభాగాన్ని భారతదేశం ఆక్రమించింది" అని గ్లోబల్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది. చైనా సరిహద్దుకు ఇవతల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ భూభాగంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మొదలైందని భారత మీడియాలో కథనాలు వచ్చాయి.

 
"కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు అనుమతి లభించింది. యురేనియం నిక్షేపాలను కనుగొనే పని ప్రారంభించాం" అని అటామిక్‌ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టరేట్‌ (ఏఎమ్‌డీ) డైరెక్టర్‌ డీకే సిన్హా సోమవారం హైదరాబాద్‌లో చెప్పారు. "ఆ ప్రదేశం ఎక్కువగా పర్వతాలతో నిండి ఉన్నందున ఆకాశం నుంచి ఈ నిక్షేపాలను గుర్తించడానికి వీలు కాలేదు. దీంతో మేం కొండలను కూడా ఎక్కాము. భారతదేశంలో మారుమూల గ్రామమైన మెచూకా వ్యాలీకి సైతం వెళ్లాము" అని ఇండియన్‌ న్యూక్లియర్‌ సొసైటీ నిర్వహించిన రేడియేషన్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్ సెమినార్‌లో సిన్హా వెల్లడించారు.

 
'యురేనియం అన్వేషణ మొదలైంది'
"అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌ జిల్లా 'ఆలో' ప్రాంతంలో ఈ అన్వేషణ జరిగింది అని డీకే సిన్హాను ఉటంకిస్తూ మార్చి 16న 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' ఒక కథనం రాసింది. ఇదే విషయంపై పశ్చిమ సియాంగ్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ రాజీవ్‌ తకూక్‌తో బీబీసీ మాట్లాడింది. "యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ జరిగినట్లు చెబుతున్న ప్రదేశం పశ్చిమ సియాంగ్‌ జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడది షియోమి జిల్లా పరిధిలోకి వచ్చింది" అని రాజీవ్‌ చెప్పారు.

 
"ఇది చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొత్త జిల్లా. ఈ ప్రాంతం నా జిల్లా పరిధిలో లేదు. అయితే అక్కడ యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభమైందన్న విషయం నాకు తెలుసు" అని అన్నారాయన. "సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే సమయంలో భారత్‌ తీసుకునే ఇలాంటి దూకుడు నిర్ణయాలు చర్చల ప్రక్రియను క్లిష్టతరం చేస్తాయి" అని గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. "టిబెట్‌ దక్షిణ భాగంలో భారత్‌ అక్రమంగా పరిశోధనలు చేస్తోంది. అరుణాచల్‌ తన భూభాగం అన్న తన వాదనను నిరూపించుకోవడానికి ఆ దేశం ప్రయత్నిస్తోంది. భారత్‌ ఉద్దేశం బయటపడింది" అని సింఘువా యూనివర్సిటీలో నేషనల్‌ స్ట్రాటజీ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చ్‌ వింగ్‌ డైరెక్టర్‌ కియాన్‌ ఫెంగ్‌ వ్యాఖ్యానించినట్లు 'గ్లోబల్‌ టైమ్స్' పేర్కొంది.

 
'భారత్‌పై చైనా చర్యలు తీసుకోవాలి'
ఇండియా ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని సింఘువా యూనివర్సిటీలో 'ఇండియన్‌ స్టడీస్‌' విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న షిచావో చైనా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినట్లు 'గ్లోబల్‌ టైమ్స్‌' పత్రిక రాసింది. ఇండో-చైనా సరిహద్దు వివాదాలు, సైనిక వ్యూహాలపై అవగాహన ఉన్న రూపక్‌ భట్టాచార్య ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

 
"అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌కు చెందిన చాలామంది అధికారులు యురేనియం నిక్షేపాల గురించి పరిశోధన చేశారు. 1969 నుంచి జరిగిన పరిశోధనల్లో రాష్ట్రానికి పశ్చిమాన ఉన్న సియాంగ్, వెస్ట్‌ కామెంగ్, దిగువ సుబాన్సిరి, ఎగువ సుబాన్సిరి జిల్లాల్లో వివిధ రకాల యురేనియం బయటపడింది" అని ఆయన అన్నారు. "యురేనియం నిక్షేపాల కోసం పరిశోధన, మైనింగ్‌ అనేవి రెండూ వేర్వేరు విషయాలు. యురేనియం కోసం శోధిస్తున్నప్పుడు రేడియో మెట్రిక్ సర్వేలు, జియోలాజికల్‌ మ్యాపింగ్, డ్రిల్లింగ్ జరుగుతుంది. ఈశాన్య ప్రాంతంలో యురేనియం మైనింగ్ మేఘాలయలో మాత్రమే జరిగింది. కాని స్థానిక గిరిజనుల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడ మైనింగ్‌ను ఆపేశారు" అని భట్టాచార్య తెలిపారు. అణ్వాయుధాల్లో వాడటానికి ఉపయోగించే యురేనియంను వ్యూహాత్మక ఖనిజంగా చెబుతారు. దీని శుద్ధి ప్రక్రియ చాలా క్లిష్టమైంది.

 
'ఇంతకు ముందు కూడా రెచ్చగొట్టే వార్తలు'
"ఈ ప్రాంతంలో యురేనియం లభించే ప్రాంతాలన్నీ వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉన్నాయి. వీటి విషయంలో చైనా ఎప్పుడూ ఇలాగే స్పందిస్తుంది" అని భట్టాచార్య అన్నారు. "చైనాలో అధికార పార్టీకి 'గ్లోబల్‌ టైమ్స్‌' మౌత్‌పీస్. అందులో మాట్లాడిన వాళ్లంతా ప్రభుత్వ డబ్బుతో నడిచే విశ్వవిద్యాలయాల్లో పని చేస్తుంటారు. కాబట్టి 'గ్లోబల్‌ టైమ్స్‌' వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఇలాగే రెచ్చగొట్టే వార్తలు రాసింది" అని అన్నారాయన. ఈ ఏడాది జనవరిలో అరుణాచల్‌ భూభాగంలో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని కొన్ని భారతీయ వార్తా చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. వీటికి ఆధారంగా ఉపగ్రహ చిత్రాలను కూడా చూపించాయి.

 
చైనా టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌తో అరుణాచల్‌ ప్రదేశ్‌కు 1129 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. "చైనా నైరుతి ప్రావిన్స్‌లోని చెంగ్డు నుంచి టిబెట్‌లోని లియాంగా వరకు రైల్వే లైనును పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్‌లో న్యాంగ్‌చి పట్టణం కూడా ఉంది. ఇది అరుణాచల్‌ ప్రదేశ్‌కు దగ్గరగా ఉంటుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. చెంగ్డు నుంచి లాసాకు ప్రయాణించాలంటే గతంలో 48 గంటలు పట్టేది. ఇప్పుడు 13 గంటల్లో వెళ్లొచ్చు. ఇందులో భారతదేశం, ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ భద్రత విషయంలో ఆందోళన కలిగించే అనేక అంశాలు ఉన్నాయి" అని రూపక్‌ భట్టాచార్య అన్నారు.