గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాలుగో దేశంగా భారత్!

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. పొరుగుదేశం చైనా మొదటి స్థానంలో నిలిచింది. మిలిట‌రీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్‌సైట్ చేసిన అధ్య‌య‌నంలో ఈ విషయం వెల్లడైంది. భారీ బ‌డ్జెట్‌లు కేటాయించినా కూడా ఈ లిస్ట్‌లో అమెరికా రెండోస్థానంలో నిలిచిన‌ట్లు ఈ స్ట‌డీ వెల్ల‌డించింది.
 
100 పాయింట్ల‌కుగాను చైనా మిలిట‌రీకి 82, అమెరికా 74, ర‌ష్యా 69, భారత్ 61, ఫ్రాన్స్ 58 సాధించి టాప్ 5‌లో నిలిచాయి. యునైటెడ్ కింగ్‌డ‌మ్ 43 పాయింట్ల‌తో 9వ స్థానంతో స‌రిపెట్టుకుంది. మిలటరీ డైరెక్ట్ అనే రక్షణ రంగ వెబ్‌సైట్ విడుదల చేసిన ‘అల్టిమేట్ మిలటరీ స్ట్రెంత్ ఇండెక్స్’లో ఈ విషయం తేటతెల్లమైంది. 
 
రక్షణ బడ్జెట్, ఆయుధ సంపత్తి, సైనిక బలగం, భూతల, గగన, సముద్ర వనరులు, సగటు వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను విడుదల చేసింది. సముద్రంలో చైనా, గగనతలంలో అమెరికా, భూతలంలో రష్యా మొదటి స్థానాల్లో ఉంటాయని నివేదిక పేర్కొంది. 
 
గగనతలానికి సంబంధించి అమెరికా వద్ద మొత్తం 14,141 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రష్యాకు 4,682, చైనా వద్ద 3,587 యుద్ధ విమానాలున్నట్టు పేర్కొంది.
 
అదే భూతల ఆయుధాలకు సంబంధించి రష్యా వద్ద అధునాతనమైన 54,866 వాహనాలు, ఆయుధ సంపత్తి ఉన్నట్టు వెల్లడించింది. అమెరికా వద్ద 50,326, చైనా వద్ద 41,641 యుద్ధ వాహనాలున్నట్టు పేర్కొంది. చైనా వద్ద అత్యధికంగా 406 సముద్ర యుద్ధ నౌకలున్నాయని చెప్పింది. రష్యాకు 278, అమెరికా/భారత్ కు 202 ఉన్నాయని వివరించింది. 
 
ఇదిలావుంటే, ప్ర‌పంచంలో అతి ఎక్కువ మిలిట‌రీ బ‌డ్జెట్ మాత్రం అమెరికాదే. ఆ దేశం ఏడాదికి 73200 కోట్ల డాల‌ర్ల బ‌డ్జెట్‌ను ర‌క్ష‌ణ రంగానికి కేటాయిస్తుంది. చైనా 26100 కోట్ల డాల‌ర్ల‌తో చైనా రెండో స్థానంలో, 7100 కోట్ల డాల‌ర్ల‌తో ఇండియా మూడోస్థానంలో ఉన్నాయి. ఇక స‌ముద్ర యుద్ధంలో చైనా, గ‌గ‌న‌త‌లం‌లో అమెరికా, ఉప‌రిత‌లంపై ర‌ష్యా బ‌లంగా ఉన్న‌ట్లు కూడా ఈ స్ట‌డీ తేల్చింది.