మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (11:29 IST)

కరోనా వైరస్ విశ్వరూపం.. 24 గంటల్లో 43 వేల కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంట‌ల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,30,288 మంది కోలుకున్నారు. 3,09,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,46,03,841 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,35,65,119 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,33,602 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య మ‌రింత‌ పెరిగిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కొత్త‌గా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 194 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,645 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,669గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,804 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,123 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 81 మందికి క‌రోనా సోకింది.