రోహిత్ శర్మ ధనాధన్ అర్థ సెంచరీ.. 30 బంతుల్లోనే అదుర్స్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు శుభారంభం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలో దిగాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది.
ఇక ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్ 30 బంతుల్లోనే 3ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌లు, ఫోర్లతో జోరందుకున్న హిట్‌మ్యాన్..శామ్ కరన్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతిని సిక్స్ కొట్టి ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు.
స్టోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతిని రోహిత్ వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు. బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను తాకింది. 9 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ(22) క్రీజులో ఉన్నాడు.