శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:14 IST)

కరోనా మృతులు లక్ష సంచుల్ని సిద్ధం చేసిన అమెరికా

కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యలో పావు వంతు అమెరికన్లదే కావడం విషాదకరమైన విషయం. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అమెరికా వైద్య వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆ మృతదేహాలను తరలించేందుకు వీలుగా ముందస్తుగా లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ 'ఫెమా' ఆ దేశ సైన్యానికి సూచించడం గమనార్హం. ఇప్పుడు ఈ వార్త ఆదేశ ప్రజలను వణికిపోయేలా చేస్తోంది.

అంతేగాకుండా.. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

హెచ్‌-1బీ వీసాతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు కరోనా వైరస్ శాపంగా మారింది. దీంతో కరోనా దెబ్బకు అమెరికాలోవున్న భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే ఉన్నారు. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు గడ్డుకాలం ఏర్పడింది.