గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (18:01 IST)

ప్రపంచ కుబేరుల జాబితా : ఎలాన్ మస్క్‌కు అగ్రస్థానం

elon musk
ప్రపంచ అపర కుబేరుల జాబితా వెల్లడైంది. ఇందులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ అగ్రస్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకార ఎలాన్ మస్క్ మొత్తం సంపద నికర విలువ 208 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో మరో ప్రపంచ కుబేరుడు బెజోస్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు 205 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెజోస్ రెండో స్థానంలోను, 199 బిలియన్‌ డాలర్లతో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్ మూడో స్థానంలో ఉన్నారు. నిజానికి ప్రపంచ అపర కుబేరుల జాబితాలో మొదటి స్థానంపై ఈ ముగ్గురు కుబేరుల మధ్య గత కొంతకాలంగా పోటీ సాగుతుంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంతో మస్క్‌ తిరిగి మొదటి స్థానానికి చేరుకున్నారు. 
 
ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో మస్క్‌ వేతన ప్యాకేజీకి ఆమోదముద్ర పడింది. 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీంతో టెస్లా షేర్లు రాణించాయి. పే ప్యాకేజీపై పోరాటం, ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికలు, టెక్-స్టాక్ ర్యాలీ కారణంగా మస్క్‌ సంపద బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ ఎక్స్‌ఏఐకి 24 బిలియన్ల డాలర్లు కంటే ఎక్కువ నిధులు వచ్చి చేరడం కూడా ఆయనకు కలిసొచ్చింది. బ్లూమ్‌బర్గ్ వెల్త్‌ ఇండెక్స్‌ ప్రకారం మస్క్‌కు కంపెనీలో 65 శాతం వాటా ఉంది. ఇవన్నీ అనుకూలించడంతో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడుగా అవతరించారు.