శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (13:55 IST)

అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా భారత సంతతి బాలుడు

Dev Shah
Dev Shah
అమెరికా స్పెల్లింగ్ బి పోటీల్లో భారత సంతతికి చెందిన బాలుడు విజేతగా మారాడు. తాజాగా అమెరికా వేదికగా 95వ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఫ్లోరిడాకు చెందిన 14 యేళ్ల భారత సంతతికి ఫ్లో దేవ్ షా విజేతగా నిలిచాడు. శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పడంతో విజేతగా నిలిచి 50 వేల అమెరికన్ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకున్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం. ఈ పోటీల అనంతరం ట్రోఫీని అందుకొన్న తర్వాత దేవ్‌ మాట్లాడుతూ 'ఇది నమ్మలేకపోతున్నాను.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి' అని వ్యాఖ్యానించాడు. 
 
గతంలో జరిగిన ఈ పోటీల్లో కూడా దేవ్ షా పాల్గొన్నాడు. 2019లో 51వ స్థానంలో.. 2021లో 76వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సారి మాత్రం పోటీల్లో విజేతగా నిలిచి తన కలను సాకారం చేసుకున్నాడు. ఇక ఈ పోటీల్లో రన్నరప్‌గా ఆర్లింగ్టన్‌ (వర్జీనియా)కు చెందిన 14ఏళ్ల బాలిక ఛార్లెట్‌ వాల్ష్‌ నిలిచారు. మొత్తం 231 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 11 మంది ఫైనల్స్‌కు చేరుకొన్నారు. 
 
మరోవైపు, తన కుమారుడు విజేతగా నిలవడంపై స్పందిస్తూ, దేవ్‌ తండ్రి దేవల్‌ 29 ఏళ్ల క్రితం భారత్‌ నుంచి అమెరికా వలస వెళ్లి స్థిరపడ్డారు. ఆయన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఈ సందర్భంగా దేవల్‌ మాట్లాడుతూ తన కుమారుడు మూడో ఏట నుంచే స్పెల్లింగ్‌ గుర్తుపెట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడని చెప్పాడు. ఆ తర్వాత ది నార్త్‌సౌత్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాడని తెలిపారు. ఈ సంస్థ భారత్‌లో పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.