మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:15 IST)

భారత విమానాలపై నిషేధం విధించిన ఇటలీ - నెదర్లాండ్స్

భారత్ కరోనా కోరల్లో చిక్కుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూ పోతోంది. 
 
రెండు రోజులక్రితం సింగపూర్‌, న్యూజిలాండ్‌, కెనడా దేశాలు భారత్‌ నుంచి విమానాలపై ఆంక్షలు విధించగా, తాజగా ఈ జాబితాలో ఇటలీ, నెదర్లాండ్స్‌ చేరాయి. గత 14 రోజులుగా ఇండియాలో ఉన్న విదేశీయులు ఇటలీకి రాకుండా నిషేధం విధించే ఫైలుపై సంతకం చేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రొబెర్టో స్పెరాన్జా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.
 
అయితే ఇటలీకి చెందినవారు భారత్‌ నుంచి తిరిగి స్వదేశానికి రావచ్చని, అలాంటివారికి కరోనా నెగెటెవ్‌ రిపోర్టు తప్పనిసరని వెల్లడించారు. అదేవిధంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇటలీకి వచ్చినవారు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరామని చెప్పారు. 
 
మరోవైపు, భారత్‌ నుంచి అన్ని ప్యాసింజర్‌ విమానాలను రద్దుచేస్తున్నామని నెదర్లాండ్స్‌ ప్రకటించింది. ఇది సోమవారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిషేధం సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మే 1 వరకు అమల్లో ఉంటుందని విమానయాన శాఖ వెల్లడించింది.