సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (10:26 IST)

ఆస్ట్రాజెనెకాపై జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ తాత్కాలిక నిషేధం... ఎందుకంటే?

ఆస్ట్రాజెనెకాపై జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ నిషేధించాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు వార్తలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అందుకే ఈ ఆక్స్ ఫర్డ్ టీకాను పక్కనబెట్టినట్లు ఆయా దేశ అధికారులు తెలిపారు. తొలుత డెన్మార్క్‌ గతవారం ఈ టీకాపై నిషేధం విధించింది.
 
అనంతరం ఐర్లాండ్‌, థాయ్‌లాండ్‌, నెదర్లాండ్స్‌, నార్వే, ఐస్‌లాండ్‌, కాంగో, బల్గేరియా తదితర దేశాలు కూడా వ్యాక్సిన్‌ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించాయి. కాగా, తమ టీకా సురక్షితమైనదేనని ఆస్ట్రాజెనెకా తెలిపింది. వ్యాక్సిన్‌ రక్తం గడ్డకట్టడానికి తమ టీకా తీసుకోవడమే కారణమని ఇంతవరకూ ఒక్క ఆధారం లేదని పేర్కొంది.
 
అయితే.. ఆస్ట్రాజెనెకా వాక్సీన్ తీసుకున్న వారిలో రక్త నాళాల్లో గడ్డలు (బ్లడ్ క్లాట్స్) కట్టినట్లు నమోదైన కేసుల సంఖ్య.. సాధారణ ప్రజానీకంలో నమోదయ్యే అవే కేసుల సంఖ్య కన్నా ఎక్కువేమీ లేవని నిపుణులు చెప్తున్నారు.
 
యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లలో గత వారాంతం వరకూ సుమారు 1.7 కోట్ల మంది ఈ వాక్సీన్ డోసు తీసుకున్నారని.. వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడ్డ కేసులు 40 కన్నా తక్కువగానే నమోదయ్యాయని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో తెలిపింది.
 
రక్తంలో గడ్డలు ఏర్పడుతున్న సంఘటనలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ప్రస్తుతం సమీక్షిస్తోంది. అదే సమయంలో.. ఈ వాక్సిన్ వల్ల ఉండే ముప్పుల కన్నా దానివల్ల లభించే ప్రయోజనాలకు ఎక్కువ విలువ ఉందని ఆ సంస్థ చెప్తోంది.