జర్మనీలో కరోనా వ్యాక్సిన్.. 4 రోజుల్లోనే పది మంది మృతి
కరోనాకు వ్యాక్సిన్ పంపిణీ చేసే పనిలో ప్రపంచ దేశాలు వున్నాయి. దేశంలోనూ ఈ పని ప్రారంభమైంది. ఈ వ్యాక్సిన్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్ వున్నాయని వైద్యులు అంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జర్మనీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల వ్యవధిలో 10 మంది మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. గత డిసెంబర్ నుంచే వ్యాక్సినేషన్‌పై జర్మనీ విస్తృత ప్రచారం చేసింది.
అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను జర్మనీలో ప్రజలకు ఇచ్చారు. మొత్తం 8,42,000 మందికి టీకా ఇచ్చారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మృతి చెందిన పదిమంది మృతికి వ్యాక్సిన్ తీసుకోవడమే కారణమని ఆ దేశం నిర్ధారించలేదు. ప్రస్తుతం ఈ మరణాలకు కారణమేంటో గుర్తించేందుకు జర్మనీ పాల్ ఎర్లిచ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల బృందం విచారణ మొదలుపెట్టింది.
నిపుణుల చెప్పిన దాని ప్రకారం.. చనిపోయిన పది మంది 79 నుంచి 93 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వ్యక్తులని చెప్పారు. వారికి వ్యాక్సిన్ ఇచ్చిన సమయం, వారు చనిపోయిన సమయం మధ్య వ్యవధి నాలుగు రోజులని తెలిపారు. చనిపోయిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, ఆ సమస్యల కారణంగానే చనిపోయారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు నిపుణుల బృందంలో ఒకరైన కెల్లర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.