తవ్వకాల్లో 1300 యేళ్ల నాటి మహావిష్ణు ఆలయం.. ఎక్కడ?
పురావస్తు శాఖ తవ్వకాల్లో 1300 యేళ్ళ నాటి పురాతన ఆలయం ఒకటి బయటపడింది. ఈ ఆలయం పాకిస్థాన్ దేశంలో బయటపడింది. వాయవ్య పాకిస్థాన్‌లోని స్వాట్ జిల్లాలో బరీకోట్ ఘుండాయ్ దగ్గర పాక్, ఇటలీకి చెందిన పురావస్తుశాఖ నిపుణులు తవ్వకాలు జరిపారు.
ఇది శ్రీమహావిష్ణువు ఆలయం అని ఖైబర్ పక్తుంక్వా పురావస్తు శాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ వెల్లడించారు. హిందూ షాహి రాజ్యంలో 1300 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు.
ఈ హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశం. క్రీస్తు శకం 850-1026 మధ్య ఈ వంశస్థులు కాబూల్ లోయ, గాంధారా (ఇప్పటి పాకిస్థాన్), వాయవ్య భారత్ ప్రాంతాన్ని పరిపాలించారు.
ఆలయ పరిసరాల్లో కంటోన్మెంట్, వాచ్‌టవర్ జాడలు కూడా పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కిందటి పురావస్తు ప్రదేశాలు ఉండగా.. తొలిసారి హిందూ షాహీస్ నాటి జాడలు కనిపించాయని ఆ అధికారి చెప్పారు.