ప్రణయ్ హత్యకేసు.. మారుతీరావు సూసైడ్ నోట్.. అమ్మ దగ్గరకి వెళ్లమ్మా అంటూ?
ప్రణయ్ హత్యకేసులో నిందితుడిగా వున్న మారుతీరావు హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో మారుతీరావు రాసినట్లు ఉన్న ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆపై మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మారుతీరావుది ఆత్మహత్యా? లేకుంటే సహజ మరణమా అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇంకా తాజాగా మారుతీ రావు రాసినట్లు చెప్తున్న ఆత్మహత్య లేఖలో గిరిజా తనను క్షమించమని.. మారుతీ రావు భార్యను ఉద్దేశించి లేఖ రాశాడు. అలాగే కుమార్తె అమృతను అమ్మదగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరినట్లు తెలిసింది.
ఇకపోతే.. ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై మారుతీరావు కూతురు, ప్రణయ్ భార్య అమృత స్పందించింది. తన తండ్రి ఆత్మహత్యపై స్పష్టత లేదని తెలిపింది. ఆత్మహత్య వ్యవహారంలో అన్ని అంశాలు తెలియాల్సి ఉందని చెప్పింది. అసలు ఎలా జరిగిందో తెలియదని, ఈ విషయంపై తాను ఈ సమయంలో ఏమీ స్పందించలేనని వెల్లడించింది.
2018 సెప్టెంబరులో ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో ఆర్యవైశ్య భవన్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందడం మరో సంచలనానికి దారితీసింది.