పోలీస్ రౌడీయిజం.. ఠాణా భవనం నుంచి దూకేసిన మాజీ సర్పంచ్
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తమ లాఠీ పవర్ చూపించారు. వారు పెట్టిన వేధింపులు తాళలేని ఓ మాజీ సర్పంచ్ పోలీస్ స్టేషన్ భవనం నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈయన జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ కుమారుడు కావడం గమనార్హం. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా షేర్ మహమ్మదాపురం మాజీ సర్పంచ్ అవినాశ్ చౌదరి. షేర్ మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దీంతో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఖాకీలు అవినాశ్‌ను వేధించసాగారు.
ఈ వేధింపులు తాళలేని అవినాశ్... స్టేషన్ భవనంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో, ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన పోలీస్ స్టేషన్‌పైకి ఎక్కారు. ఆయనను అడ్డుకోవడానికి ఒక వ్యక్తి రాగా... వెంటనే ఆయన పై నుంచి దూకేశారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది.