ఇరాక్‌లో రెండో రోజు అమెరికా వైమానిక దాడులు.. ఇరాన్ జనరల్ మృతి
ఇరాక్‌లో రెండోరోజు అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఉత్తర బాగ్దాద్‌లో రాకెట్లతో అమెరికా దాడులు చేసింది. ఈ దాడులలో నలుగురు మరణించారు. ఇరాక్ మిలీషియా కమాండర్ లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. ఇరాక్‌తో మరో యుద్ధం చేసే అవకాశం లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందువల్ల అమెరికా మరిన్ని దాడులకు పాల్పడవచ్చని తెలుస్తోంది.
అంతకుముందు బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన రాకెట్ దాడిలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కొన్ని కార్లు ద్వంసమయ్యాయి. ఎయిర్ కార్గో టెర్మినల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. మొత్తంగా మూడు రాకెట్ దాడులు జరిగినట్టు అధికారులు ప్రకటించారు.
కాగా బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడికి పాల్పడింది తామేనని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే ఇరాన్ క్వడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలేమన్‌ను హతమార్చినట్టు పెంటగాన్ వెల్లడించింది. ఇరాక్‌లో అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సోలెమన్ కీలక పాత్ర పోషించాడని పెంటగాన్ ఆరోపించింది.
విదేశాల్లో ఉన్న తమ అధికారులపై సోలెమన్ దాడులు జరిపేందుకు కుట్రలు చేస్తున్నాడన్న సమచారం ఉండడంతోనే ఈ దాడులు చేసినట్టు తెలిపింది. ఇది తమ అధికారులను రక్షించుకునే చర్యల్లో భాగమేనని అమెరికా సమర్థించుకుంది. శుక్రవారంనాడు బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ పై జరిగిన రాకెట్ దాడుల్లో ఇరాన్ ఎలైట్ క్వాడ్స్ చీఫ్ జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ అనుకూల మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ మహండిస్ తో సహా 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.