కాందహార్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. వీధుల్లోనే నిద్రిస్తున్న చిన్నారులు
ఆఫ్టనిస్థాన్‌లోని ఒక్కో నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో సగభాగానికిపైగా తాలిబన్ల ఆధీనంలో ఉండగా, తాజాగా దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా వారి వశమైంది. ఈ మేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు.
దీంతో ఇక ప్రభుత్వ ఆధీనంలో కేవలం రాజధాని కాబూల్, మరో ప్రావిన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటి కే ఆష్ఘనిస్తాన్ లోని తొమ్మిది ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించిన తాలిబన్లు గురువారం కొత్తగా ఘాజ్నీ, హేరట్ ప్రావిన్సులను తమ ఖాతాలో వేసుకున్నారు.
కాబూల్-కాందహార్ రోడ్డు మార్గంలో ఉన్న ఘజ్నీ పట్టణాన్ని కూడా గురువారం తాలిబన్లు ఆక్రమించారు. అది కూడా కీలక పట్ణమే. ఇక సిల్క్ రోడ్డు మార్గంలో ఉన్న ప్రాచీన నగరం హీరత్ వద్ద కూడా తాలిబన్లు తిష్టవేశారు. ఆ పట్టణ వీధుల్లోకి దూసుకువెళ్లిన తాలిబన్లు.. అక్కడ ఉన్న పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై తమ జెండాను ఎగురవేశారు.
లొంగిపోతున్న ఆఫ్ఘన్ దళాలను తాలిబన్లు చంపేస్తున్నారని కాబూల్‌లో ఉన్న అమెరికా ఎంబసీ పేర్కొన్నది. ఇది చాలా హేయంగా ఉందని, యుద్ధ నేరాలు జరుగుతున్నట్లు అమెరికా తెలిపింది.
గడిచిన నెల రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ సుమారు వెయ్యి కన్నా ఎక్కువ మంది సాధారణ పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది ప్రజలు కూడా భయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గడిచిన కొన్ని రోజుల నుంచి సుమారు 72 వేల మంది చిన్నారులు కాబూల్‌కు తరలివచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లంతా వీధుల్లోనే నిద్రిస్తున్నట్లు సేవ్ ద చిల్ట్రన్ సంస్థ తెలిపింది.