శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (19:40 IST)

'లజాడా' సైట్‌లో ఐఫోన్ బుకింగ్... పార్శిల్ విప్పిచూస్తే...

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, ఈ-కామర్స్ సైట్లలోనే ఈ మోసాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఆన్‌లైన్‌లైన్లలోనే తమకు కావాల్సి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

కానీ, పలు మోసపూరిత కంపెనీలు మాత్రం బుక్ చేసిన గూడ్స్ ఐటెమ్స్ కాకుండా, ఇటుకలు, సిమెంట్ పలకలు వంటివి పంపుతున్నాయి. తాజాగా లజాడా అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ బుక్ చేసిన ఓ వ్యక్తికి భారీ సైజులో ఉండే కాఫీ టేబుల్ వచ్చింది. దీన్ని చూసిన అతను ఒకింత షాక్‌కు గురయ్యాడు. ఇది థాయ్‌లాండ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓ కుర్రోడు ఐఫోన్‌-7పై ఆశపడ్డాడు. దీంతో ఆ ఫోన్ పలు వెబ్‌సైట్లలో శోధించగా, అందులో ‘లజాడా’ అనే ఓ ఈ-కామర్స్ సైట్‌లో చాలా తక్కువ ధరకు ఐఫోన్ అమ్మకానికి పెట్టినట్టు గుర్తించారు. 
 
దీంతో మరో ఆలోచన లేకుండా దానిని కొనేశాడు. దానికి అవసరమైన నగదును చెల్లించేశాడు. కొద్ది రోజులకు అతడికి ఆ ఆర్డర్‌ ఇంటికొచ్చింది. అయితే ఆ ప్యాకింగ్ చూడగానే అతడికి మతిపోయింది. ఎందుకంటే అది భారీ బాక్స్‌లో ప్యాక్ చేసి ఉంది. 
 
వాస్తవానికి ఐఫోన్‌కు అంత బాక్స్ రావడంతో షాకైన ఆ కుర్రాడు ‘సరే.. లోపలముందో చూద్దాం’ అనుకుని బాక్స్ తెరవగా అందులో ఐఫోన్ షేప్‌లో ఉన్న ఓ భారీ కాఫీ టేబుల్ ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను అతడు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 
తాను బుక్ చేసినప్పుడే కొంత అనుమానం కలిగిందని, చాలా తక్కువ ధరకు మొబైల్ రావడం, షిప్పింగ్ ఖర్చు ఎక్కువగా తీసుకోవడంతో కొంత అనుమానం కలిగిందని, కానీ ఐఫోన్ అనే ఆలోచనలో బుక్ చేసేశానని అతడు వివరించాడు.