శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (12:10 IST)

తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు!

twitter deal elon musk
ట్విట్టర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వశమైంది. దీంతో ఆయన అనేక మంది ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటుందని పేర్కొంటూ ఉద్యోగులపై వేటు వేశారు. అలా సగం మందిని ఇంటికి పంపించారు. వీరిలో చాలా మందిని మళ్లీ వెనక్కి పిలుస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తిరిగి రమ్మని వారికి లేఖలు రాస్తున్నారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
సంస్థలోని కమ్యూనికేషన్, కంటెంట్ క్యురేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ తదితర శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులలో సగం మందిని ఇంటికి పంపించారు. ఇందులో కొంతమంది సేవలు కంపెనీకి అవసరముందని ఆలస్యంగా గ్రహించారు. 
 
కొందరు ఉద్యోగుల తొలగింపులో పొరపాటు జరిగిందని, అందువల్ల అలాంటి వారిని తిరిగి చేర్చుకుంటున్నట్టు పేర్కొంది. ట్విటర్‌లో ఆ సంస్థ కొత్త యాజమాన్యం ఎలాన్ మస్క్ తీసుకునిరాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగుల సేవలు ఎంతో అవసరమని ఉందని భావించినట్టు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులలో కొంతమందికి తిరిగి వచ్చేయాలంటూ ట్విట్టర్ ఆహ్వానం పంపినట్టు బ్లూమ్ బర్గ్ తెలిపింది. అయితే, ఈ కథనంపై ట్విట్టర్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, బ్లూ టిక్ చార్జీల పెంపును అమలు చేసేందుకు అవసరమైన మార్పులను ట్విట్టర్ చేపట్టింది.