రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం.. మరోమార్గం లేకే తీసివేతలు : ఎలాన్ మస్క్
ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. రోజుకు 40 లక్షల డాలర్ల మేరకు నష్టాన్ని చవిచూస్తున్నామని, అందువల్లే ఉద్యోగుల్లో కోత విధిస్తున్నట్టు ఆయన తెలిపారు.
భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 180 మందిని తొలగించారు. అలాగే, ఇతర దేశాల్లో కూడా ఈ తీసివేతలు కొనసాగుతున్నాయి. ఆయన ట్విట్టర్ పగ్గాలు చేపట్టగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌పై చర్యలు తీసుకున్నారు. ఇపుడు కింది స్థాయిలో ఉద్యోగులపై దృష్టిసారించారు. వీటిపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఎలాన్ మస్క్ స్పందించారు.
ట్విట్టర్ రోజుకు 40 లక్షల డాలర్లు నష్టపోతుందని వెల్లడించారు. నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. అయితే, తొలగించిన ఉద్యోగులకు ట్విట్టర్ అండగా ఉంటుందని చెప్పారు. మూడు నెలల పాటు వారికి సగం కంటే ఎక్కువ వేతనాన్ని చెల్లిస్తామని తెలిపారు.