ట్విట్టర్ బాటలో ఫేస్‌బుక్ - ఉద్యోగుల మెడపై కత్తి
ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. అలాగే, సంచలన మార్పులు చేస్తున్నారు. ఇపుడు ఇదే బాటను ఫేస్‌బుక్ యాజమాన్యం కూడా ఎంచుకుంది. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు ఫేస్‍బుక్ మాతృసంస్థ అయిన మెటా నిర్ణయం తీసుకుంది. 18 యేళ్ల ఫేస్‌బుక్ చరిత్రలో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఉద్యోగుల తొలగింపు ప్రకటన బుధవారం చేసే అవకాశం ఉంది.
నిజానికి కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు కొంతమేరకు చక్కబడుతున్నాయి. మరోవైపు, అనేక కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన చెదుతున్నారు. ఇపుడు ఫేస్‌బుక్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.
బుధవారం నాటి ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబరు ఆఖరు నాటికి 87 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్టు మెటా పేర్కొంది. ఇందులో భారీ సంఖ్యలో తొలగించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇటీవల ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థలోని ఉద్యోగులను సగానికి తగ్గిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేసేలా ఇప్పటికే పలు విభాగాలకు చెందిన హెడ్‌లపై వేటు వేయగా, పలువురు ఉద్యోగులను తొలగించారు. ఇపుడు ఫేస్‌బుక్ కూడా ఇదే బాటలో పయనించడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.