గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 మార్చి 2024 (20:57 IST)

153 మంది ప్రయాణికులతో విమానం: నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు, దారి తప్పిపోయింది, ఆ తర్వాత?

plane
విమానం నడుపుతున్న సమయంలో ఇద్దరు పైలెట్లు ఒకేసారి నిద్రపోయారు. దానితో ఆకాశంలో విమానం 30 నిమిషాల పాటు దిక్కూదెస లేకుండా దారితప్పి ప్రయాణించింది. అర్థగంట తర్వాత ప్రధాన పైలెట్ కి మెలకువ రావడంతో కంట్రోల్ అధికారులతో సంప్రదించి దారితప్పి వెళ్లిపోతున్న విమానాన్ని తిరిగి గాడిలో పెట్టడంతో పెనుప్రమాదం తప్పింది. విమానంలో 153 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది వున్నారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. విధుల్లో నిద్రపోయిన ఇద్దరు పైలెట్లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేసారు.
 
అసలు ఏం జరిగిందంటే... బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 153 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి జకర్తాకు బయలుదేరింది. విమానం ఆకాశంలోకి వెళ్లిన కొద్ది నిమిషాల తర్వాత కో-పైలెట్ అనుమతితో ప్రధాన పైలెట్ నిద్రపోయాడు. ఐతే మరికొన్ని నిమిషాల్లోనే విమానం నడుపుతున్న కో-పైలెట్ కూడా నిద్రమత్తులోకి జారుకున్నాడు. దాంతో విమానం దారి తప్పింది. అర్థగంట తర్వాత ప్రధాన పైలెట్ కి మెలకువ వచ్చి చూడగా కో-పైలెట్ గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.
 
విమానం దారి తప్పి వెళ్లిపోతుందని గమనించి వెంటనే కంట్రోల్ రూంని సంప్రదించాడు. వారు అప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించినట్లు చెప్పారు. చివరికి వారికి దిశానిర్దేశం చేయడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగింది. ఐతే పైలెట్ల వ్యవహారంపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ విచారణకు ఆదేశించారు.