శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (12:35 IST)

పెళ్లికి ముందే అమ్మాయి - అబ్బాయి... సహజీవనం చట్టబద్ధమే.. ఎక్కడ?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) భారీ సంస్కరణల దిశగా పయనిస్తోంది. పశ్చిమ దేశాల పర్యాటకులు, ఉద్యోగం, వ్యాపారం కోసం దేశానికి వచ్చే వారిని ఆకర్షించే దిశగా సంస్కరణల్లో భాగంగా ఇప్పటి అమల్లో ఉన్న కఠిన చట్టాలను సవరించింది. 
 
ఇప్పటి వరకు అమల్లో ఉన్న కఠిన చట్టాలను నెమ్మదినెమ్మదిగా సడలిస్తూ పోతోంది. తాజా సంస్కరణల్లో భాగంగా పెళ్లి చేసుకోకుండా యువతీ యువకులు సహజీవనం చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, మద్యం విక్రయాలపై ఉన్న ఆంక్షలను కూడా సడలించింది. 
 
ఇకపై 21 ఏళ్లు, ఆపై వయసు వారికి మద్యం విక్రయించడాన్ని నేరంగా పరిగణించి జరిమానా విధించడం, మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం వంటివి ఉండవు. తాజా నిబంధన ప్రకారం లైసెన్స్ లేకున్నప్పటికీ మద్యం తాగడం తప్పు కాదు. 
 
అలాగే, పరువు హత్యలను నేరంగా పరిగణించనున్నారు. ఇతర నేరాలతో సమానంగా వీటికి కూడా శిక్షలు ఉంటాయి. పెళ్లి కాకుండా సహజీవనం చేసే వారికి ఎటువంటి శిక్షలు ఉండవు.  
 
పశ్చిమ దేశాల పర్యాటకులు, ఉద్యోగం, వ్యాపారం కోసం దుబాయ్‌ వెళ్లే వారికి స్వర్గధామం చేసే దిశగా యూఏఈ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.