ధోనీకి ఏమైంది? అలసిపోయాడు.. పరిగెత్తలేకపోయాడు.. రికార్డ్ బ్రేక్ (Video)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా ఓటములు చవిచూస్తోంది. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 165 పరుగులు కూడా ఛేజింగ్ చేయలేకపోయింది. మహేంద్ర సింగ్ ధోని ఆఖరి వరకూ క్రీజులో ఉన్నా కూడా మునుపటిలా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇక ఆఖరి రెండు ఓవర్లలో మహేంద్ర సింగ్ ధోని ఎంతగానో ఇబ్బంది పడ్డాడు.
ధోని (36 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచినప్పటికీ.. రన్ రేట్‌కు తగ్గట్టుగా ఆడలేక అలసిపోయినట్లు కనిపించాడు. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌లను చెన్నై ఓడిపోయింది. 2014 ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడటం ఇదే తొలిసారి.
ధోని దగ్గుతూ కనిపించాడు.. తాను ఎంతగానో అలసిపోయినట్లు కనిపించాడు. వికెట్ల మధ్య బాగా పరిగెత్తినా.. ఈ మ్యాచ్‌లో తీవ్రంగా అలసిపోయాడు. ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే స్థితిలోకి వెళ్లాడు. దుబాయ్‌లో ఎక్కువగా పొడి వాతావరణం ఉన్న కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చిందని ధోనీ వివరించాడు.
తాను గ్రౌండ్‌లో ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ సమయం ఉండటానికి ప్రయత్నించాను. కానీ అక్కడ చాలా పొడిగా ఉంది. దాంతో గొంతు పూర్తిగా డ్రై అయిపోయింది. దాంతో దగ్గు వచ్చింది. అయినా కానీ టీమ్ గెలుపు కోసం దాన్ని భరించేందుకు అంగీకరించానని అన్నాడు.
అయితే ఐపీఎల్ లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఘనత ధోని (194) సృష్టించాడు. ఇప్పటివరకు సురేశ్ రైనా (193) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ శర్మ(192) కూడా ఈ రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు.