శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (11:52 IST)

లాడెన్ కుమారుడి ఆచూకీ చెప్తే... మిలియన్ డాలర్లు...

ఒకవైపు ఉగ్రదాడులకు కేంద్రంగా ఉందని పేర్కొంటూ... భారత్ చేస్తున్న దాడులతో తలపట్టుకు కూర్చున్న పాక్‌కి ఈసారి అమెరికా చేసిన ప్రకటన మరింత ఇరకాటంలో పడేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్, ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నాడనీ, అతని ఆచూకీ చెప్తే మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.16 కోట్లు) బహుమతిగా ఇస్తామనీ అమెరికా ప్రకటించింది. 
 
హంజా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉండొచ్చుననీ, ఒకవేళ అక్కడ లేకుంటే ఇరాన్‌లో ఉండి వుంటాడని అనుమానం వ్యక్తం చేసిన అమెరికా, అతన్ని పట్టించినా లేదా ఆచూకీ చెప్పినా బహుమతి ఇస్తామని వెల్లడించింది. 
 
ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖేల్ ఇవనాఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్‌ఖైదాకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, లాడెన్‌ని మట్టుబెట్టిన తర్వాత ఉగ్రవాద సంస్థకు హంజా బిన్ లాడెన్ నాయకుడయ్యాడనీ, ఇంటర్నెట్‌లో అతని ఆడియో, వీడియో సందేశాలు వస్తున్నాయనీ గుర్తు చేసారు. కాగా, జనవరి 2017లో అమెరికా హంజా బిన్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.