సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:47 IST)

అన్న పైపైకి.. తమ్ముడు దివాళా...

భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో అరుదైన ఘనత సాధించారు. తొలిసారిగా ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితాలో మొదటి 10 మందిలో స్థానం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని 'ద హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019' వెల్లడించింది.
 
54 బిలియన్ డాలర్ల (రూ.3.83 లక్షల కోట్లు) నికర సంపదతో అంతర్జాతీయ కుబేరుల జాబితాలో పదో స్థానంలో నిలిచినట్లు సమాచారం. రిలయన్స్‌లో ముకేశ్‌కు 52 శాతం వాటా ఉంది, గత నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లకు చేరింది. ఆర్ఐఎల్ షేర్లు రాణించడంతో ఈ ఏడాది ముకేశ్ సంపద భారీగా పెరిగింది. దీనితో ఆయన ఈ ఘనత సాధించగలిగారు. కానీ, ఆయన సోదరుడు అడాగ్ అధినేత అనిల్ అంబానీ మాత్రం ఆస్తులు కరిగిపోగా, అప్పులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయన మూడు వేలకు పైగా స్థానంలో ఉన్నారు. 
 
అయితే ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది కూడా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోన్ 147 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 96 బిలియన్ డాలర్ల సంపదతో బిల్‌గేట్స్, 88 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా భారతీయ కుబేరుల్లో ముకేశ్ తర్వాత హిందూజా గ్రూప్ ఛైర్మన్ (21 బిలియన్ డాలర్లు), విప్రో ఛైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ (17 బిలియన్ డాలర్లు) ఉన్నారు.