శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:06 IST)

భూతవైద్యుడి మాట విన్న కన్నబిడ్డను పొట్టనబెట్టుకున్న తండ్రి

కన్నతండ్రి భూతవైద్యుడి మాటలు విని కన్నబిడ్డను పొట్టనబెట్టుకున్నాడు. కొడుకుని బాగు చేయాలనే తాపత్రయంతో ఈ పనిచేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరులో మారుతీకాలనీలో నివసిస్తున్న హరీష్, రేణుకలకు పృథ్వీ అనే కొడుకు ఉన్నాడు. మూడేళ్ల ఆ బాలుడు మానసికంగా బాధపడుతూ వచ్చాడు. 
 
దీంతో తన కుమారుడిని బాగు చేసేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. చివరికి ఎవరో చెబితే భూత వైద్యుడి దగ్గరకి తీసుకువెళ్లాడు. బాబుకు వాతలు పెడితే చురుకుగా మారతాడని అతడు చెప్పడంతో, రోజూ అతడికి సిగరెట్ కాల్చి వాతలు పెట్టేవాడు. ఇలా వారం రోజులు చేశాడు. 
 
ఆ వాతల కారణంగా బాలుడికి తీవ్ర జ్వరం వచ్చింది. దాంతో స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తల్లిదండ్రులపై తాత నంజుండప్ప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని విచారించారు. మూఢనమ్మకాలతో శిశువు ఉసురుపోసుకున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.