బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (10:42 IST)

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన 4 ఐటీ కంపెనీలు.. యాహూ ఉద్యోగులకు చేదు వార్త

హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. ఫలితంగా 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. బిచాణా ఎత్తేసిన కంపెనీలు అన్ని స్టార్టప్‌

హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. ఫలితంగా 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. బిచాణా ఎత్తేసిన కంపెనీలు అన్ని స్టార్టప్‌ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవి కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించిన కేటుగాళ్లు.. కన్సల్టెన్సీల ద్వారా అనేక మందిని మోసం చేశాయి. 
 
ఇలాంటి కంపెనీల చేతుల్లో మోసపోతున్న వారిలో అత్యధికంగా బీటెక్‌ విద్యార్థులు ఉండటం గమనార్హం. ఒక్కో కంపెనీలో ఉద్యోగం కోసం ఒక్కో టెక్కీ దాదాపు రూ.2 లక్షల వరకూ సమర్పించుకున్నారు. ఇక బాధితులంతా మాదాపూర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు... ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం యాహూలో పనిచేస్తున్న 2 వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. 4.48 బిలియన్ డాలర్ల‌తో యాహూను సొంతం చేసుకోబోతున్న వేరిజాన్ కమ్యూనికేషన్.. కొనుగోలు పూర్తయ్యాక 2 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వేరిజాన్‌కు చెందిన ఏఓఎల్, యాహూ నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని తెలుస్తోంది. 
 
రెండు యూనిట్లలో కలిపి 15 శాతం మందిని తొలగించనున్నట్టు సమాచారం. కాలిఫోర్నియాతోపాటు అమెరికా బయట కూడా ఉద్యోగుల కోత ఉంటుందని విశ్వనీయ వర్గాల సమాచారం. గురువారం జరిగిన షేర్ హోల్డర్ల సమావేశంలో కంపెనీ విక్రయానికి షేర్ హోల్డర్లు అంగీకరించారు.