2021 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు.. ముఖేష్ అంబానీ
2021 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను అందించడం మొదలుపెడుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020లో మాట్లాడుతూ.. అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని అభివర్ణించారు. ఈ ఆధిపత్యం కొనసాగించడానికి అవసరమైన 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా ప్రారంభించేందుకు విధానపరమైన నిర్ణయాలు భారత్ త్వరగా తీసుకోవాలన్నారు. దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.
రిలయన్స్ తీసుకొచ్చే 5జీ నెట్‌వర్క్ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిందని అంబానీ పేర్కొన్నారు. వీటి హార్డ్‌వేర్, టెక్నాలజీ మొత్తం దేశంలోనే సిద్ధం కానున్నాయని ముఖేష్ అంబానీ చెప్పారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా జియో 5జీ ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికీ 2జీ వినియోగిస్తూ చాలా సేవలకు దూరంగా ఉన్నవారిని స్మార్ట్‌ఫోన్లు వినియోగించి అభివృద్ధి ఫలాలు అందుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.