శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (09:02 IST)

ఒక్క రోజులో రూ.50 వేల కోట్ల ఆస్తి ఆవిరి... 7 నెలల తర్వాత నష్టం..

దేశ పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి అపారనష్టం వాటిల్లింది. అదీ కూడా ఒక్క రోజులోనే కావడం గమనార్హం. ఆయన మొత్తం సంపదంలో ఒక్క రోజులో 50 వేల కోట్ల రూపాయల (7 బిలియన్ డాలర్లు) మేరకు నష్టపోయారు. 
 
ఆయన సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోవడంతో దాదాపు ఏడు నెలల తర్వాత, రిలయన్స్ ఈక్విటీ భారీగా నష్టపోయింది. సంస్థ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. సోమవారం భారత స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతం మేరకు పతనమైంది. 
 
ఈ ప్రభావం సెన్సెక్స్ పైనా కనిపించింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముఖేశ్ ఆస్తుల విలువ 78 బిలియన్ డాలర్ల నుంచి 71 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. కాగా, శుక్రవారం రాత్రి తన రెండో త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన సంస్థ లాభం 15 శాతం తగ్గిందని ప్రకటించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంధన డిమాండ్ పడిపోయిందని, దీంతో ఆదాయం 24 శాతం తగ్గి రూ.1.16 లక్షల కోట్లకు చేరగా, రూ.9,570 కోట్ల లాభం వచ్చిందని సంస్థ తెలిపింది. 
 
రెండో త్రైమాసికంలో అత్యధిక ప్రజలు ఇంటికే పరిమితం కావడం, రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండి, ఇంధన అమ్మకాలు పడిపోవడం రిలయన్స్ లాభాలు తగ్గడానికి కారణమైంది. ఇదే మూడు నెలల వ్యవధిలో కేవలం ఇంధన రంగంపైనే కాకుండా, టెక్నికల్, డిజిటల్ సేవలకు సంస్థను విస్తరించాలన్న ఉద్దేశంతో ముఖేశ్ అంబానీ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన సంగతి తెలిసిందే.