1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (13:40 IST)

హైదరాబాద్ నగరంలో హైఅలెర్ట్... రోడ్లు మూసివేత...

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. న‌గ‌ర వ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో రెండు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. ఈ వర్షాల ధాటికి ఇప్పటివరకు 11 మంది మృత్యువాతపడ్డారు. 
 
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు బుధ, గురువారాల్లో సెలవు ప్రకటించారు. మరో రెండుమూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
 
కాగా, మంగళవారం కురిసిన వర్షానికి నగరంలోని దాదాపు 1500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 
 
జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. దీనికి తోడు హైదరాబాద్‌కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరో మూడు రోజులపాటు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
 
ఇదిలావుంటే, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రోడ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాలకు సైతం వరద నీరు వెళ్ళి చేరింది. దీంతో అనేక రహదారులపై నడుంలోతు నీళ్ళు నిలబడివున్నాయి. ఈ కారణంగా అనేక రోడ్లను మూసివేశారు. 
 
అలా మూసివేసిన రహదారుల్లో.. ఉప్ప‌ల్ - ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ - కోఠి రోడ్లను మూసివేశారు. అలాగే, కాచిగూడ రైల్వేష్టేష‌న్‌లో ప‌ట్టాల‌పై నిలిచిన వ‌ర్ష‌పు నీరు నిలిచివుంది. నిజాంపేట‌తో పాటు బండారి లేఅవుట్ జ‌ల‌మ‌యంకాగా, మెహిదీప‌ట్నం - హైటెక్ సిటీ ర‌హ‌దారి పూర్తిగా నీటిలోవుంది. 
 
కూక‌ట్‌ప‌ల్లి ఐడీపీఎల్‌, హాఫిజ్‌పేట చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగ‌ర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో 4 గేట్లు ఎత్తివేశారు. దిగువ ప్రాంతాల వారిని ఖాళీ చేశారు. గ‌చ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారితో పాటు బెంగ‌ళూరు - హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ హైవేలను కూడా మూసివేశారు.