మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (09:35 IST)

డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో నెంబర్-1: అప్‌లోడ్ వేగంలో మాత్రం డౌన్

ఉచిత డేటా ఆఫర్‌తో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 21.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో నవంబరులో జియో అగ్రస్థానంలో నిలించింద

ఉచిత డేటా ఆఫర్‌తో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 21.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో నవంబరులో జియో అగ్రస్థానంలో నిలించింది. దీంతో టెలికాం నియంత్రణ సంస్థ నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో జియో నెంబర్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తర్వాతి  స్థానాల్లో నిలిచాయి.
 
విచిత్రంగా ఆ నెలలో అప్‌లోడ్ వేగంలో జియో నాలుగో స్థానానికి పడిపోయింది. 7.1 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబరులో 21.9 ఎంబీపీఎస్‌గా ఉన్న జియో డౌన్‌లోడ్ వేగం నవంబరులో తగ్గిపోగా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు వృద్ధి సాధించాయి.
 
అక్టోబరులో ఎయిర్‌టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ వేగం వరుసగా 7.5, 8.7 ఎంబీపీఎస్‌గా నమోదు కాగా నవంబరులో 9.3, 9.9గా నమోదైంది. టెలికం ఆపరేటర్లు ఇటీవల అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాలను క్రమంగా పెంచుతూ పోతున్నప్పటికీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ స్థానం 109వ స్థానంలోనే నిలిచిపోయింది. 
 
ఇదిలా ఉంటే.. స్పెక్ట్రం, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో సహా తమ్ముడు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన మొబైల్ వ్యాపార ఆస్తులను అన్నయ్య ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కైవసం చేసుకోనుంది. ఇందులో భాగంగా ఓ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.